728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Wednesday, 13 July 2011

ముంబైలో వరుస పేలుళ్లు, 21 మంది బలి


ముంబై మహానగరం మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాద రక్కసి మరోసారి కోరలుసాచింది. అమాయక ప్రజల ప్రాణాలను హరించటమే లక్ష్యంగా ఉగ్రముష్కరులు మళ్లీ మారణహోమానికి తెగబడ్డారు. బుధవారం సాయంత్రం.. జనసమ్మర్థంతో రద్దీగా ఉన్న జవేరీబజార్, ఒపేరాహౌస్, దాదర్‌లలో వరుస వెంట బాంబులు పేల్చారు. ఈ విస్ఫోటనాలకు 21 మంది ముంబై వాసులు బలయ్యారు. మరో 113 మంది గాయపడ్డారు. రెండున్నరేళ్ల కిందట పాకిస్థాన్ నుంచి వచ్చిన పది మంది ఉగ్రవాదులు సాగించిన మారణహోమం మిగిల్చిన గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబై నగరం.. తాజా బాంబు పేలుళ్లతో గడగడలాడిపోయింది. దేశం యావత్తూ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముంబైతో పాటు ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాలన్నింటిలోనూ హై అలర్ట్ ప్రకటించారు. పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు.

ముంబై, న్యూస్‌లైన్: మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద దాడులకు లక్ష్యంగా మారిన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం సాయంత్రం 6:50 గంటల నుంచి 7.04 గంటల మధ్య జనసమ్మర్థంతో కూడిన మూడు వేర్వేరు ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. సాయంత్రం 6:50 గంటలకు జవేరీబజార్‌లో తొలి పేలుడు సంభవించింది. ఒక్క నిమిషం తర్వాత అంటే 6:51 గంటలకు ఒపెరాహౌస్ ప్రాంతంలో రెండో పేలుడు సంభవించింది. అనంతరం 7:04 గంటలకు దాదర్ ప్రాంతంలో మూడో బాంబు పేలింది. ఈ పేలుళ్లలో 21 మంది చనిపోయారని, 113 మంది గాయపడ్డారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఛగన్ భుజ్‌బల్ తెలిపారు.

6:50 ... జవేరీబజార్
జవేరీబజార్‌లోని ఖావు గల్లీ పరిసరాల్లో జరిగిన పేలుడు ఒక గొడుగులో ఉంచిన పేలుడు సామాగ్రి వల్ల జరిగి ఉండవచ్చని అక్కడ లభించిన శిథిలాలను బట్టి పోలీసు నిర్థారణకు వచ్చారు. ఇక్కడ నలుగురు చనిపోగా, 30 మంది గాయపడ్డట్లు సమాచారం. ప్రఖ్యాత ముంబాదేవి ఆలయం పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఉంది. 2003లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో కూడా జవేరీ బజార్ రక్తమోడింది. ఆ నాటి దాడిలో ఇక్కడ 54 మంది చనిపోయారు.

6:51 .... ఒపేరాహౌస్
ఒపేరాహౌస్‌లో జరిగిన పేలుళ్లలో సుమారు వంద మందికి పైగా గాయపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మెజెస్టిక్ సినిమా థియేటర్ సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఇక్కడ ఏడుగురు చనిపోగా వంద మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులంద రినీ సమీపంలో ఉన్న జేజే, జీటీ అస్పత్రులకు తరలించారు. జేజేలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోగా, 45 మందికి చికిత్స పొందుతున్నారు. జేటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు.

7:04 ... దాదర్
దాదర్‌లోని కబూతర్ ఖానాకు కూతవేటు దూరంలో ఉన్న బెస్ట్ బస్ స్టాపు వద్ద బాంబు పేలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్టాపులోని విద్యుత్ కేబినెట్‌లో సంభవించిన పేలుడు తీవ్రతకు అదే సమయంలో పక్కనుంచి వెళుతున్న ఎంహెచ్-43-ఎ-9384 నెంబరు కారు ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు, మరో ఐదుగురు మృతి చెందినట్లు తెలిసింది. ఇక్కడ గాయపడిన ఐదుగురిని పరేల్‌లోని కేఈఎం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స పొందుతున్న వారిలో ప్రశాంత్ బువడ్, విశ్వకర్మ, వర్షా కరియా, లుసీనియా డిసోజా, ధనంజయ్ అధికారి, శరీష్ కాందల్కర్, అభినవ్‌రావ్ ఉన్నారు.

స్థానికులు, పోలీసుల సహాయచర్యలు...
పేలుళ్లు సంభవించిన వెంటనే స్థానికులు, పరిసరాల్లో ఉన్నవారు తక్షణమే బాధితులు, క్షతగాత్రులకు సాయహస్తం అందించారు. గాయపడి రక్తపుమడుగుల్లో ఉన్నవారిని అందుబాటు ఉన్న వాహనాల్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మహారాష్ట్ర యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బృందాలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. గాయపడిన వారిని సెయింట్ జార్జ్, నాయర్, కేఈఎం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్ తెలిపారు.

పేలుళ్లలో ఆర్‌డీఎక్స్, ఐఈడీ...
పేలుళ్లకు అమోనియం నైట్రేట్, ఆర్‌డీఎక్స్ ఉపయోగించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అత్యాధునిక పేలుడు పరికరాల (ఐఈడీల)ను ఉపయోగించి బాంబులు పేల్చినట్లు పోలీసులు తెలిపారు. జవేరీబజార్‌లోని ఘటనా స్థలం నుంచి పేలకుండా ఉన్న ఒక ఐఈడీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దాదర్ పేలుడుకన్నా.. ఒపెరాహౌస్, జవేరీబజార్‌లలోని పేలుళ్లు శక్తిమంతమైనవని ముంబై పోలీస్ కమిషనర్ అరూప్‌పట్నాయక్ చెప్పారు. పేలుళ్లు జరిగిన కొద్ది సేపటికే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో.. ఫోరెన్సిక్ నిపుణులు రాకముందే కీలక సాక్ష్యాధారాలు వర్షపు నీటికి కొట్టుకుపోతాయన్న ఆందోళన పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే.. అప్పటికే ముంబై ఫోరెన్సిక్ నిపుణులు, ఏటీఎస్ బృందం కీలక సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

సందేహాస్పద వస్తువులు లభ్యం...
వరుస పేలుళ్ల నేపథ్యంలో ముంబై నగర వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. శాంతాక్రజ్ (పశ్చిమం)లో అనుమానాస్పద బ్యాగు లభించింది. దీన్ని ఏటీఎస్, బాంబు నిర్వీర్యం బృందం స్వాధీనంలోకి తీసుకుని పరీక్షిస్తున్నారు. అలాగే దాదర్‌లో కూడా ఒక బాంబు దొరినట్లు వదంతులు వచ్చాయి. దాని గురించి సరైన సమాచారం అందలేదు.

కసబ్‌కు పుట్టిన రోజు కానుకా?
2008 నవంబర్ 26వ తేదీన ముంబైపై మారణహోమానికి తెగబబడిన ఉగ్రవాదుల్లో ప్రాణాలతో దొరికిన అజ్మల్ కసబ్ ప్రస్తుతం ఉరిశిక్ష ఎదుర్కొంటూ ముంబైలోనే ఆర్థర్ కాటన్ రోడ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం (జూలై 13) అతడి 24వ పుట్టిన రోజు కావటం కాకతాళీయమేనా.. లేక అతడికి పుట్టిన రోజు కానుకగానే ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 26/11 ఉగ్రవాద దాడుల్లో 166 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ముంబైలో సీరియల్ రైలు పేలుళ్లు జరిగి ఐదేళ్లు నిండిన రెండు రోజులకే తాజా పేలుళ్లు సంభవించటం ఈ సందర్భంగా గమనార్హం. ఐదేళ్ల కిందట ముంబై లోకల్ రైళ్లలో ఉగ్రవాదులు జరిపిన వరుస బాంబు పేలుళ్లలో 186 మంది బలయ్యారు.

చవాన్‌కు ప్రధాని ఫోన్...
పేలుళ్ల విషయం తెలియగానే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని హోంమంత్రి చిదంబరాన్ని ప్రధాని ఆదేశించారు. పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.

ఉగ్రవాదుల పనే: చిదంబరం
వరుస వెంట బాంబు పేలుళ్లు సంభవించటాన్ని బట్టి.. ఇవి ఉగ్రవాదులు సమన్వయంతో చేసిన దాడులేనని తేటతెల్లమవుతోందని కేంద్ర హోంమంత్రి చిదంబరం పేర్కొన్నారు. పేలుళ్ల అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేలుళ్ల నేపథ్యంలో ముంబైలోని ఎన్‌ఎస్‌జీని అప్రమత్తం చేసి రంగంలోకి దించామని చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్‌ల నుంచి ఫోరెన్సిక్ నిపుణుల బృందాలను, ఎన్‌ఐఏ బృందాన్ని ముంబై పంపుతున్నట్లు తెలిపారు. బాంబు పేలుళ్ల ప్రాంతాలను సందర్శించి, బాధితులను పరామర్శించేందుకు చిదంబరం బుధవారం రాత్రికే ముంబై వెళుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే.. పేలుళ్లకు బాధ్యత తమదేనని ఏ ఉగ్రవాద సంస్థకూడా ప్రకటించలేదు. అయితే.. ఇండియన్ ముజాహిదీన్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ముంబైలో వరుస పేలుళ్లు, 21 మంది బలి Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh