728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Tuesday, 8 January 2013

'హద్దు' మీరిన పాక్ - ఇద్దరు జవాన్ల తలలు నరికిన పాక్ బలగాలు

తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ మంగళవారం మరింత తెగబడింది. నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైనికులు మంగళవారం భారత సైన్యానికి చెందిన గస్తీ బృందంపై విరుచుకుపడ్డారు. లాన్స్ నాయక్‌లు హేమరాజ్, సుధాకర్ సింగ్‌ల తలలను తెగనరికినట్టు సమాచారం. మరో ఇద్దరు సైనికులను తీవ్రంగా గాయపరచారు. మృతులు, క్షతగాత్రుల ఆయుధాలతో పాటు మృతుల్లో ఒకరి తలను తమతో తీసుకుపోయారు. ఇది కవ్వింపు చర్యేనంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. కవ్వింపు చర్యకు పాల్పడినట్లు భారత్ చేసిన ఆరోపణను పాక్ యథాప్రకారం తోసిపుచ్చింది.

జమ్మూ: పాకిస్థాన్ మరోసారి సరి‘హద్దు’ మీరింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి గాలికొదిలేసింది. నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైనికులు మంగళవారం ఇద్దరు భారత సైనికులను అత్యంత దారుణంగా చంపారు. వారి తలలను తెగనరికారు. మృతులు, క్షతగాత్రుల ఆయుధాలతో పాటు మృతుల్లో ఒకరి తలను తీసుకుపోయారు. పాక్ బలగాలు మంగళవారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా వద్ద నియంత్రణ రేఖను (ఎల్‌ఓసీ) దాటి చొరబడ్డాయి. అడ్డుకున్న భారత సైన్యానికి చెందిన గస్తీ బృందంపై దాడికి దిగాయి. దాడిలో లాన్స్ నాయక్‌లు హేమరాజ్, సుధాకర్ సింగ్‌ల తలలను పాక్ సైనికులు నరికారు, ఇద్దరిని గాయపరచారు. మృతుల్లో ఒకరి తలను వారు తమతో తీసుకుపోయినట్లు సమాచారం.

పాక్ దాడిలో భారత సైనికుల మృతిని ధ్రువీకరించిన భారత సైన్యం, వారి తలలను తెగనరికినట్లు వచ్చిన వార్తలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పాకిస్థాన్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) సైనికులు పూంచ్ జిల్లా కృష్ణాఘాటీ ప్రాంతంలో ఎల్‌ఓసీని దాటి భారత భూభాగంలోకి చొరబడ్డారు. అదే సమయంలో అటు వెళుతున్న భారత సైన్యానికి చెందిన గస్తీ బృందం వారిని నిలువరించడంతో పరస్పర కాల్పులు జరిగాయి. దాదాపు అరగంట సేపు కాల్పుల తర్వాత బీఏటీ బృందం వెనక్కు మళ్లింది. పాక్ సైనికుల దాడిలో లాన్స్ నాయక్‌లు హేమరాజ్, సుధాకర్ సింగ్ నేలకొరిగినట్లు ఉధామ్‌పూర్‌లోని నార్తర్న్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. వారి తలలు నరికినట్లు వచ్చిన వార్తలపై ఈ ప్రకటనలో ఎలాంటి వివరాలు పేర్కొనలేదు. ఇది మరో కవ్వింపు చర్యేనని, అధికారిక మార్గాల్లో దీనిని ఖండించనున్నామని పేర్కొంది. ఈ సంఘటనపై రక్షణశాఖతో విదేశాంగ శాఖ సంప్రదింపులు కొనసాగిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.

పాక్ సైన్యం ఇటీవల తరచుగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని, ప్రతికూల వాతావరణాన్ని అనువుగా తీసుకుని ఎల్‌ఓసీ మీదుగా చొరబాటుదారులను భారత భూభాగంలోకి పంపడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలకు తెగబడుతోందని సైనికాధికారులు చెబుతున్నారు. రాజౌరి, ఉరి, కెరాన్ సెక్టార్లలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఎల్‌ఓసీకి ఆవల హజీ పీర్ సెక్టార్‌లో ఉన్న తమ సైనిక స్థావరంపై ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకుండానే భారత సైనికులు దాడి చేశారని, దాడిలో తమ సైనికుడు ఒకరు మరణించాడని ఆరోపిస్తూ పాక్ అధికారికంగా భారత్‌కు తన నిరసనను తెలిపిన మరునాడే తాజా సంఘటన జరగడం గమనార్హం. అయితే, పాక్ ఆరోపణలను భారత సైన్యం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కాగా, కృష్ణాఘాటీ సెక్టార్ వద్ద మంగళవారం ఉదయం 11.30 గంటలకు పాక్ సైనికులు భారత భూభాగంలోకి చొరబడి, భారత సైన్యానికి చెందిన గస్తీ బృందంపై దాడి చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయుధాలను దోచుకుపోయినట్లు చెప్పాయి.

కవ్వింపు చర్యే... ఖండిస్తాం: భారత ప్రభుత్వం

ఇది కవ్వింపు చర్యేనంటూ భారత ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై పాకిస్థాన్‌కు నిరసన తెలపనున్నట్లు ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నామని రక్షణ శాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కె.టి.పర్నాయక్ సంఘటనా స్థలాన్ని సందర్శించారని, రెండు మృతదేహాల్లో ఒకదానిని నరికివేసినట్లు ధ్రువీకరించారని ఆర్మీ అదనపు డెరైక్టర్ జనరల్ (ప్రజా సమాచారం) మేజర్ జనరల్ ఎస్.ఎల్.నరసింహన్ చెప్పారు. అయితే, లాన్స్‌నాయక్‌లు ఇద్దరి తలలను పాక్ సైనికులు నరికారని అనధికార వర్గాలు చెబుతున్నాయి.

కాల్పుల విరమణను ఉల్లంఘించడమే దారుణమని, అలాంటిది సైనికులను నరకడం ఏ నాగరిక సమాజంలోను ఆమోదయోగ్యం కాదని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించారు. ఇది ఉభయ దేశాల నడుమ సాగుతున్న చర్చల ప్రక్రియను పక్కదోవ పట్టించే యత్నమేనని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గడచిన నెల్లాళ్ల వ్యవధిలోనే పాక్ దాదాపు డజనుసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. కాగా, తాజా సంఘటన కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ సౌరభ్ కాలియా దారుణ హత్యను గుర్తుకు తెస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా, కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు భారత్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన పాక్, ఆదివారం తమ స్థావరంపై భారత సైన్యం చేసిన దాడి సంఘటన నుంచి దారి మళ్లించేందుకు భారత్ ఇలాంటి దుష్ర్పచారానికి పాల్పడుతోందని ఆరోపించింది. తమ బలగాలు ఎల్‌ఓసీని దాటలేదని, ఎలాంటి దాడులకు పాల్పడలేదని ఓ పాక్ సైనికాధికారి చెప్పారు. ఈ విషయాన్ని తాము ధ్రువీకరించుకున్నామన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: 'హద్దు' మీరిన పాక్ - ఇద్దరు జవాన్ల తలలు నరికిన పాక్ బలగాలు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh