728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Friday, 11 January 2013

"భారతీయతను ప్రపంచానికి చాటిన ధీశాలి" స్వామి వివేకానంద 150వ జయంతి ప్రత్యెక వ్యాసం


శ్రీరామచంద్రుని తలవగానే ఆంజనేయుడు గుర్తొస్తాడు. అలాగే శ్రీరామకృష్ణపరమహంస పేరు విన్న వెంటనే స్వామి వివేకానంద మదిని మెదులుతాడు. 1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన సర్వమత మహాసభ ఆయనకు ఓ ఆశాజ్యోతిగా కనిపించింది. అష్ట కష్టాలుపడి ఆ సభకు వెళ్ళి తనదైన బాణీలో అత్యద్భుతంగా తన వాణిని వినిపించారు. ఆ ప్రసంగం చారిత్రక ప్రసిద్ధం. ఆ మరునాడు వివేకానందుని ప్రతిభను శ్లాఘిస్తూ ఆనాటి అమెరికా వార్తా పత్రికలు సంపాదకీయాలు రాశాయంటే ఆ ప్రసంగం ఎంత మహత్తరమో ఇక వేరుగా చెప్పనఖ్ఖరలేదు.
వివేకానందుడు 1863 జనవరి 12వ తేదీ విశ్వనాథ దత్త; భువనేశ్వరీ దేవి దంపతుల ముద్దుబిడ్డగా కలకత్తా నగరం (కోల్‌కతా)లో జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు ‘‘నరేన్’’ అని పేరు పెట్టుకున్నారు. పసితనంతో తల్లి భువనేశ్వరీదేవి నరేన్‌కి విద్యాభ్యాస అనంతరం శ్రీమద్రామాయణ, మహాభారత కథలు ఎంతో శ్రద్ధగా బోధిస్తూండేది. తద్వారా వినయ విధేయతల్ని అలవరచుకొని గురువులకు ఎంతో ప్రీతిపాత్రుడై ఉండేవారు. పెరిగి పెద్దయ్యాక న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, వేద శాస్త్రాలతోపాటు భగవద్గీత మొదలైన భారతీయ దర్శనాల అధ్యయనంలో అపార ఆసక్తి కనబరుస్తూ ఎంతో ఎత్తులకు ఎదిగిపోయారు. తర్వాత ఆయన రాజారామ్ మోహన్‌రాయ్‌చే స్థాపింపబడిన బ్రహ్మ సమాజంలో చేరారు. అక్కడ ఆయన మనసు కుదుట పడింది గానీ సంతృప్తికల్గలేదు.
అన్నింటికీ ఆ దేవుడే దిక్కు అని అందరూ అంటూండగా దేవుడున్నాడా? ఎలా ఉంటా డు? ఈ ప్రశ్న ఆయన్ని కుమ్మరి పురుగులా తొలిచింది.ఆయన మనసెరిగిన కాలేజీ ప్రిన్సిపాల్ లిలియం హేస్ట్ దొర సలహా మేరకు దక్షిణేశ్వరంలోని రామకృష్ణుల వారి వద్దకు వెళ్ళిన నరేన్ మనసులో ఏమున్నదో పసిగట్టిన రామకృష్ణులు ‘‘ఏమిటి నీ సందేహం?’’ అని అడిగారు. ‘‘మహాశయా! దేవుడున్నాడా?’’ అని ప్రశ్నించాడు నరేన్. ‘‘ఉన్నాడు’’ అన్నారు రామకృష్ణుల వారు. ‘‘మీరు చూశారా?’’ అని అడిగాడు ఆ వెంటనే, ‘‘చూశాను. నిన్నిప్పుడు చూస్తూన్నంత దానికన్నా స్పష్టంగా చూశాను’’ అని చెప్పిన వెంటనే ‘‘మరయితే దేవుణ్ణి నాకు చూపెడతారా??’’ అని అడిగాడీసారి. ‘‘తప్పకుండా చూపెడతాను’’ అన్నారు. ‘‘సరే! చూపెట్టండి’’ అన్నాడు నరేన్. వెంటనే తన కుడికాలిపాదం నరేన్ నెత్తిన పెట్టి బొటన వేలితో మెల్లిగా పుణక మీద నొక్కారు. రామకృష్ణులయందున్న యోగీశ్వర శక్తి నరేన్‌ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇది గమనించిన రామకృష్ణులు ‘‘ఇవ్వాల్టికికచాలు’’ అని చెప్పి వెంటనే కాలు పక్కకి తీశారు. ఆయనను గురువుగా ఎంచుకుని వారి ద్వారా ఆధ్యాత్మిక సాధన పొందాడు. ఈ గురుశిష్యుల బంధం నభూతో నభవిష్యతిగా నిలచింది.
అటుపై నరేన్ న్యాయశాస్త్రం చదివేందుకై కాలేజీలో చేరాడు. కొంతకాలం తర్వాత తండ్రి మరణించడంతో పరిస్థితుల కారణంగా చదువు అటకెక్కింది. కాలగమనంలో రామకృష్ణులు గొంతు క్యాన్సర్ వ్యాధి కారణంగా పడకపట్టారు. మృత్యువు దగ్గర పడుతోందని గ్రహించి నరేన్‌ని దగ్గరికి పిలచి పక్కన కూచుండ బెట్టుకొని ‘‘నాయనా ఇకపై నీ శక్తి సామర్థ్యాలను దీనజనులకోసం వినియోగించే ప్రయత్నం చేయడం మంచిది’’ అని చెప్పి తన ఆధ్యాత్మిక సాధనా సంపత్తినంతటినీ నరేన్‌కి ధారపోసి 1816 ఆగస్టు 16న మహాసిద్ధి పొందారు. అనంతరం గురుదేవుల చితాభస్మ కలశాన్ని తీసుకొని బాలానగర్ వెళ్ళి దానిని అక్కడ ప్రతిష్టించిన మీదట ఇకపై నా శక్తి సామర్థ్యాలను జగత్కల్యాణానికై వినియోగిస్తానని ప్రతిజ్ఞచేసి ఆ క్షణం నుండి తన పేరును ‘‘స్వామి వివేకానంద’’గా మార్చుకున్నారు. సనాతన ధర్మవైశిష్ట్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసేందులకై పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు పడ్డ కష్టాలు; అవరోధాలు ఇంతా అంతా కావు.
ఈ విశ్వంలో పుణ్యభూమి అనిపించుకునే అర్హత కేవలం ఈ భారత భూమికి మాత్రమే ఉన్నది. మహోన్నత సౌజన్యం; ఉదారత్వం; పవిత్రత; ప్రశాంతత అన్నింటినీ మించి ఆధ్యాత్మికత అంతర్వీక్షణాలను మానవాళికి అందించిన మహత్తర భూమి మన భారత భూమి. ఈ నేలకు సదా కృతజ్ఞలమై ఉండాలి అని చెప్పిన మాతృదేశాభిమాని వివేకానంద. 1867లో శ్రీరామకృష్ణ మిషన్ సంస్థను స్థాపించారు.
లక్షలాది ప్రజలు ఆకలి; అజ్ఞానంతో జీవిస్తూండగా వారి గోడు ఏమాత్రం పట్టించుకోని ప్రతి వ్యక్తినీ దేశద్రోహి అనే అంటారు’’ అంటూ ఓ సభా ముఖంగా అన్నారు వివేకానంద. ప్రాపంచిక విషయాల్లో కొట్టుకొంటూ పురుగుల్లా చావడంకంటే కర్తవ్య నిర్వహణతో మరణించటమే ఉత్తమం అని కూడా చెప్పారు. చివరిగా ఓ మహాసభలో ప్రసంగిస్తూ ‘‘శ్రీరామకృష్ణ పరమహంస వారి సేవకునిగా ఎన్ని జన్మలైనా ఎత్తడానికి నేను సిద్ధమే’’ అంటూ ఆ గురుశిష్యుల సంబంధాన్ని మరోసారి గుర్తుచేసిన నిరహంకారి ఆయన. పాశ్చాత్యుల కొరకు అవతరించిన శంకర భగవత్పాదులే స్వామి వివేకానంద అని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణవారు చెప్పిన మాట తప్పక అంగీకరించాల్సిందే.
-ఎం.సి.శివశంకరశాస్ర్తీ
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: "భారతీయతను ప్రపంచానికి చాటిన ధీశాలి" స్వామి వివేకానంద 150వ జయంతి ప్రత్యెక వ్యాసం Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh