728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Sunday, 10 February 2013

ప్రపంచానికే మార్గదర్శకం హిందూ ధర్మం - ఘోష్ తరంగ్ సర్వజనికోత్సవంలో మాన్య శ్రీ భయ్యాజీ జోషి


హైదరాబాద్, ఫిబ్రవరి 10: హిందూ ధర్మం చాలా గొప్పదని, విశ్వానికే మార్గదర్శనం చేసిన హిందూ ధర్మాన్ని రాజకీయ స్వార్థంతో కాషాయ ఉగ్రవాదమంటూ హిందూ అస్తిత్వంపై కొందరు దాడిచేస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ కార్యవాహ భయ్యాజీ జోషి ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి సౌభ్రాతృత్వానికి హిందూ మతం ఒక్కటే ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ పశ్చిమాంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో ఘోష్ తరంగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భయ్యాజీ జోషి కీలకోపన్యాసం చేస్తూ హిందూ దేవాలయాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధుసంత్‌లపై ప్రణాళిక ప్రకారం కొన్ని శక్తులు దాడిచేస్తున్నాయని ఆరోపించారు. భారతదేశంలో హిందువులకు భద్రత కరవైందని, దీపావళి, దసరా, వినాయకచవితి తదితర పర్వదినాలు జరుపుకోవాలంటేనే ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రజాపరిరక్షణలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. శ్రీరామ మందిరాన్ని అయోధ్యలో నిర్మించాలని, అయోధ్యలో రామమందిర నిర్మాణం భారత ప్రజల ఆకాంక్షతోపాటు హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశంగా అభివర్ణించారు.
మహిళలను పూజించే హిందూ దేశంలో మహిళలకే రక్షణ కరవైందన్నారు. దేశం ముందు అనేక సవాళ్ళు ఉన్నాయని, వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. హిందువులంతా ఏకమై గొప్ప సంకల్పాన్ని తీసుకుని భావితరాలకు శాంతియుతమైన దేశాన్ని అందించాలని పిలుపునిచ్చారు. దీనికి అన్నివర్గాల ప్రజలు వివేకవంతంగా ముందడుగు వేయాలన్నారు. కేవలం ఓ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు రాజకీయ స్వార్థంతో హిందూ అస్తిత్వంపై దాడిచేస్తున్న శక్తుల కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అంతర్గత ఉగ్రవాదం ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోందని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవించలేని దుస్థితి నెలకొందన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన సిరివెనె్నల సీతారామశాస్ర్తీ మాట్లాడుతూ భారతీయ మిలటరీ బ్యాండ్‌ను పోలిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల విన్యాసం నయనానందకరంగా ఉందన్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో భారతీయ సంగీతానికి సంబంధించిన వాయిద్యాలతో కరసేవకుల సంగీతనాదం ప్రశంసనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో స్వాగత కమిటీ అధ్యక్షులు పద్మశ్రీ ఆచార్య ఎల్లా వెంకటేశ్వరరావు, ప్రాంత సంఘచాలక్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎస్‌ఎస్ అఖిలభారత సహశారీరక్ ప్రముఖ్ జగదీష్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల ప్రచారక్ మంగేష్ బిండే, అఖిలభారత సహసేవా ప్రముఖ్ అజిత్ జి మహాపాత్ర పాల్గొన్నారు

సౌజన్యం : ఆంధ్రభూమి 
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ప్రపంచానికే మార్గదర్శకం హిందూ ధర్మం - ఘోష్ తరంగ్ సర్వజనికోత్సవంలో మాన్య శ్రీ భయ్యాజీ జోషి Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh