728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Monday, 5 September 2011

ఆదోని నిమజ్జనంలో ఘర్షణ రాళ్లవర్షం - టియర్ గ్యాస్ ప్రయోగం -గాలిలో కాల్పులు - కర్ఫ్యూ

source : andhrabhoomi

63మందికి గాయాలు రాళ్లవర్షం, కర్రలతో దాడి నాలుగు లారీలు దగ్ధం దుకాణాలు లూటీ, నిప్పు టియర్ గ్యాస్ ప్రయోగం గాలిలోకి పోలీసు కాల్పులు ఆదోనిలో కర్ఫ్యూ

ఆదోని, సెప్టెంబర్ 5: గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫలితంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. గణేష్ నిమజ్జనం ఊరేగింపులో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. కర్రలతో దాడులకు దిగాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టారు. రాళ్లదాడిలో 20మంది పోలీసులు, 43మందికి గాయాలయ్యాయి. అల్లరిమూకలు రెచ్చిపోయి నాలుగు లారీలు, మోటార్ సైకిల్‌ను దగ్ధం చేశారు. దుకాణాలు లూటీ చేసి నిప్పు పెట్టారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ మళ్లీ రెండు వర్గాలు దాడులకు దిగాయి. దీంతో పొరుగు జిల్లాల నుంచి అదనపు బలగాలను హుటాహుటిన ఆదోనికి రప్పించారు. కలెక్టర్, ఎస్‌పి ఆదోనిలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఆదోనిలో సోమవారం మధ్యాహ్నం ఉదయం గణేష్ నిమజ్జనం ప్రారంభమైంది. లంగర్‌బావి వీధి గుండా నిమజ్జనానికి గణేష్ విగ్రహాన్ని తరలిస్తూ డప్పులు కొడుతూ యువకులు నృత్యం చేయసాగారు. ఇంతలో అక్కడే ఉన్న ప్రార్థనా మందిరం వద్దకు ఊరేగింపు చేరుకోగానే ఓ వర్గం వారు డప్పులు కొట్టవద్దని చెప్పారు. అయితే యువకుల అదేమీ పట్టించుకోకుండా ముందుకు సాగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు వర్గాల వారు గుమిగూడి పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో యువకులు విగ్రహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయినా అల్లర్లు ఆగలేదు. రెచ్చిపోయిన అల్లరిమూకలు రోడ్డుపై నిలిపిన నాలుగు లారీలను, మోటారు సైకిల్‌ను దగ్ధం చేశారు. దుకాణాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. అనంతరం గాలిలోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టారు. రాళ్లు రువ్వుకున్న సంఘటనలో ఎస్పీ, ఎఎస్పీ, సిఐతో సహా 20మందికి గాయాలయ్యాయి. సిఐ రామచంద్ర, ఎఎస్పీ శిమోసిపైకి రాళ్లు వచ్చిపడ్డాయి. ఒక స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ తలకు బలమైన గాయమైంది. సుజాత, ఉసేని, జమీర్, రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. లంగర్‌బావి వీధిలో గొడవలు జరిగినట్టు తెలుసుకున్న ఓ వర్గం వారు మెయిన్ బజారులోని కొన్ని దుకాణాలను లూటీ చేశారు. వాటికి నిప్పు పెట్టారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. ఆదోనిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ శివప్రసాద్, కలెక్టర్ రాంశంకర్ నాయక్ హుటాహుటిన తరలివచ్చారు. పట్టణంలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అల్లర్లు జరిగిన లంగర్‌బావి ప్రాంతానికి చేరుకున్న ఎస్పీ ఇరువర్గాలకు నచ్చచెపుతుండగా ఆయనపైకి సైతం రాళ్లు విసిరారు. ఆదోనిలో కర్ఫ్యూ విధించి, నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, జనం ఇళ్లనుంచి బయటకు రావద్దని ఎస్పీ ప్రకటించారు. ప్రజలు సంయమనం పాటించాలని, వదంతులు నమ్మవద్దని కోరారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ఆదోని నిమజ్జనంలో ఘర్షణ రాళ్లవర్షం - టియర్ గ్యాస్ ప్రయోగం -గాలిలో కాల్పులు - కర్ఫ్యూ Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh