728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 1 October 2011

వామన రూపం.. త్రివిక్రమ తేజం! నేడు లాల్‌బహదూర్ జయంతి

                      రచయిత:  టంగుటూరి శ్రీరాం

అది క్రీస్తుశకం 1966 జనవరి 10వ తేదీ భారతీయులకత్యంత ప్రియమైన సంకాంత్రి పండుగ రెండు రోజులలో రానున్నది. ప్రజలు ఆంనదోత్సవాలతో ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి మహలక్ష్మికి స్వాగతం పలకడానికి ఏబదికోట్ల భారత ప్రజానీకం స్వాగతం పలకడానికి ఆయత్తమవుచుండగా భారత ప్రజలతోపాటు, యావత్ప్రపంచ ప్రజలు కూడా ఒకానొక శుభ సంతోషం కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అదే తాష్కెంట్ సంయుక్త ప్రకటన.
ఏబదికోట్ల ప్రజానీకానికి నాయకుడై ప్రతి భారతీయుని సుఖశాంతులతో జీవింపచేయడానికి శపథం చేసి, దీక్షబూని రేయనక, పగలనక తన శక్తి సామర్థ్యాలనొడ్డిన కారణజన్ముడు లాల్ బహదూర్. సోవియట్ యూనియన్ లోని తాష్కెంట్ సమావేశంలో పాల్గొని, విజయశంఖారావం పూరించారు లాల్ బహదూర్. జనవరి 10న సాయంకాలం తాష్కెంట్ శిఖరాగ్ర సభ ముగిసింది.్భరత, పాకిస్తాన్‌లు సుఖశాంతులతో వర్ధిల్లడానికి తాష్కెంట్, మహానగరంలో శాస్ర్తిజీ సర్వసన్నాహాలు పూర్తి చేసుకున్న రోజు ఆ జనవరి10. .్భరత, పాకిస్తాన్ నాయకుల సంయుక్త ప్రకటన వెలుడింది. ‘‘ఉభయ దేశాల నాయకులు తమతమ వివాదాలను బలప్రయోగం ద్వారా కాక శాంతి మర్గాన పరిష్కరించుకొనడానికి సమ్మతించారు’’.1965 సెప్టెంబర్ 6 నుండి 23 వరకూ పద్దెనిమిది రోజులు సాగిన సంగ్రామంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. నవంబర్ 24న లోక్‌సభలో రక్షణమంత్రి చవన్ ప్రకటనబట్టి తుది బేరీజు తెలియవచ్చింది. పాక్ సైనికులు 5800 మంది చనిపోయారు. 475 యుద్ధ టాంకులు మన వశమైనాయి. అందులో 39 చెక్కు చెదరని స్థితిలో మనకు పట్టుబడినాయి. మొత్తం 75 పాక్‌విమానాలు కూలిపోయినాయి. 80 టాంకులు చెడిపోయినాయి. అందులో 48 బాగా దెబ్బతిన్నాయి. భారత్ 28 విమానాలను నష్టపడవలసి వచ్చింది.
మొదట పాకిస్తాన్ దాడి ప్రారంభించింది. పాక్ తలపెట్టిన ‘గ్రాండ్ స్లామ్’ అష్టదిగ్బంధనము ఢిల్లీ ముఖముమీదనే వెక్కిరించ ప్రారంభించింది. ‘‘సహనము హద్దు దాటినది. మీనమేషములు లెక్కించరాదు. భారత సైన్యము కూడా అంతర్జాతీయ సరిహద్దులు దాటి పాకిస్తాన్‌పై దెబ్బకు దెబ్బ తీయవలసిందే’’ అని నిర్ణయము తీసుకొన్నాడు మన ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ. అంతే యుద్ధ స్వరూపమే మారిపోయింది. శాస్ర్తిజీ మన సైన్యాలను అత్యంత చాకచక్యంగా ముందుకు నడిపించాడు. భారత సేనల ఎదురు దాడికి తట్టుకోలేక పాక్ సైనికులు పిక్కబలం చూపారు. ‘చావుకు పెడితే కాని లంఖనాలకు రాదు’ అన్నట్టు అప్పుడు కానీ పాకిస్తాన్ సంధికి రాలేదు.
జాతి మేల్కొన్నది. యావద్భారతము ఒకే వ్యక్తిగా నిలదొక్కుకున్నది. పక్కా అహింసావాది, గాంధీజీ పరమ భక్తుడు. పట్టుకుచ్చు కంటె సుతిమెత్తని వాడు. అలుగటయే యెరుంగని అజాత శత్రువు శాస్ర్తీ. ‘‘పొట్టివాడు ఇంత గట్టి వాడా?’’ అని దేశ, విదేశాల ప్రజలు, రాజకీయ మేధావులు విభ్రాంతి పోయారు. రణక్షేత్రము నుండి పోరాటము దౌత్యరంగానికి మారింది. సామరస్య సాధన కోసం ప్రధాని శాస్ర్తిజీని, పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్‌ను సోవియట్ ప్రధాన మంత్రి అలెక్సి ఎస్. కొసిగిన్, తమ ఉజ్జెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ రావలసిందిగా ఆహ్వానించాడు. శాంతిని సాధించడం కన్నా విప్లవ సంక్రాంతి లేదు అని నమ్మిన లాల్ బహదూర్ 14 మంది సభ్యులతో తాష్కెంట్ కు బయలుదేరాడు. ప్రతినిధి వర్గంలో రక్షణమంత్రి యశ్వంత్ రావ్ చవన్, విదేశాంగ మంత్రి సర్ణసింగ్, వాటి శాఖల అధికారులూ ఉన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశ భవనం ‘‘తటస్థ ప్రసాదం’’ అనే పేరును సంతరించుకున్నది. అత్యంత స్నేహ సద్భావ వాతావరణంలో సోవియట్ రష్యా ఆధ్వర్యాన భారత్ పాక్‌నాయకులు యుద్ధ విరమణ, శాంతి స్థాపన ఒప్పందాల ప్రకటనమీద సంతకాలు చేశారు. శాంతి సౌమనస్యాలకు దోహదకారి కాగల ఒక సమాధానాన్ని సాధించి, ఒక యుద్ధాన్ని, గెలిచి ఒక చారిత్రక సన్నివేశంలో కన్నుమూసి చరితార్ఢుడైనాడులాల్ బహదూర్. ఆయన జీవితగాధ స్వాతంత్ర భారత చరిత్రలో ఒక మహాజ్వలధ్యాయానికి నాంది వాచకం. పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను, బాధలను సహనంతో, సాహసంతో ఎదురొడ్డి అనేక ఉన్నత పదవులను అధిష్ఠించి ఎన్నో నూతన ప్రజోపకార పథకాలను అమలు పరిచిన ఆదర్శ పురుషుడాయన.
ఉత్తర ప్రదేశ్‌లోని మొగల్ సరాయి గ్రామంలో 1904 అక్టోబర్ 2న లాల్‌బహదూర్ జన్మించారు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక బతకలేని బడిపంతులు. దురదృష్టవశాత్తు కొడుకు పుట్టిన ఏడాదిన్నరకే శారదాప్రసాద్ చనిపోవడంతో ఆ నిరుపేద కుటుంబాన్ని తాతగారు ఆదుకొని ఆశ్రయం కలిగించారు. కాశీవిద్యాపీఠ్‌లో నాలుగు సంవత్సరాలు చదివి బి.ఎ. డిగ్రీతో సమానమైన ‘శాస్ర్తీ’ పరీక్ష పాస్ కావడంతో ఆయన లాల్‌బహదూర్ శాస్ర్తీగా ప్రఖ్యాతి చెందాడు. ‘శాస్ర్తి’అనే డిగ్రీ ఆయన పేరుతో కలిసి దేశవాసులు గౌరవంగా పిలుచుకునేవారు. కానీ లాల్‌బహదూర్‌కు ఇష్టము లేదు. అలాగే ఇంటిపేరైన ‘శ్రీవాత్సవ’ను తన పేరులో నుంచి తొలగించుకున్నారు. ఎందుకంటే ఇంటిపేరు తన కులాన్ని సూచిస్తుంది కాబట్టి.... అంతటి ఉత్తమ విలువలుగల ప్రజానాయకుడాయన. షష్టిపూర్తి ఐనది కాని సొంత ఇల్లు లేదు. గృహము లేని గృహమంత్రి అని అలహాబాద్ ప్రజలు లాల్‌గారికి పెట్టిన ముద్దుపేరు. ఉత్తర ప్రదేశ్ పోలీస్ మంత్రిగా ఉండినప్పుడు ఒకసారి అలహాబాద్‌కు వెళ్లాడు అతిసామాన్యుడిగా ధోవతి, లాల్చీ, టోపీ తప్ప ఆయనకు ఏ హంగులు లేవు. పైగా మూడోతరగతిలో ప్రయాణించి పక్క గేట్‌లో నుంచి స్టేషన్ బయటకు పోదామనుకున్నాడు. లాల్‌బహదూర్ హోమ్ మంత్రి. జనాలు, బ్యాండ్ బాజాలతో, పూలమాలలతో ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్ దగ్గర వేచి ఉన్నారు. అన్ని గేట్లు మూసివేసి పోలీస్ బందోబస్తు చేశారు. సరే ఈ వామనావతారుడ్ని గేట్ దగ్గర పోలీస్ ఆపి ‘బయటికి ఎవ్వరూ పోడానికి వీల్లేదు. మా పోలీస్ మంత్రిగారు వస్తున్నారు’’ అన్నాడు. ‘‘నేనయ్యా ఆ పోలీస్ మంత్రిని’’ అని శాస్ర్తీ అన్నాడు. ‘‘నీలాంటి ఒంటి ఊపిరి మనిషి పోలీస్ మంత్రి ఎన్నటికీ కాలేడు’’ అన్నాడు పోలీసు. తరువాత ఎవరో గమనించి ఆయనను పూలమాలలతో అలంకరించగా శాస్ర్తిజీ చిరునవ్వుతో ఆ పోలీస్‌ను చూసి వెళ్ళిపోయారు.
1961లో నెహ్రూ మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పని చేసారు. ఆయన పదవి నుండి వైదొలిగే నాటికి ఉండటానికి ఇల్లు కూడా లేదు. అందుకే ఆయనకి ఆ పేరు. 1962లో లోక్‌సభకు ఎన్నికై తిరిగి హోంమంత్రి అయినారు. హోంమంత్రిగా లాల్‌బహదూర్ దక్షత అసమానమైనది. 1956లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రెండుచోట్ల ప్రమాదాలు జరిగాయి. ఈ దుర్ఘటనలు తన లోపమని అనుకొని రాజీనామా చేసాడు. ఎందరో శాస్ర్తీగారిని వారించారు. నెహ్రూ ప్రాథేయపడ్డాడు. కానీ శాస్ర్తిజీ రాజీనామా ఇచ్చి పార్లమెంట్ మెట్లు దిగి బయటకి నడిచిపోయాడు అందరూ చూస్తుండగానే. తన ప్రభుత్వ కార్ డ్రైవర్ కార్ తలుపు తెరిచి సెల్యూట్ చేసాడు. శాస్ర్తి నవ్వుతూ అతని భుజము తట్టి ‘‘నేనిప్పుడు మంత్రిని కాదయ్యా!’’ అని చెప్పి బస్‌స్టాండ్ దాకా నడిచి లైన్‌లో నిలబడి బస్సులో ఇంటికి వెళ్ళాడు.
మూడుమాసాల బిడ్డగా ఉన్నప్పుడు జోతిష్కులు శాస్ర్తీజాతకం చూసి ‘‘ఈ పిల్లవాడు దేశ విదేశాలను మెప్పించగల పుణ్యపురుషుడవుతాడు’’ అని చెప్పారు. 1921లో ఒక రోజున సత్యాగ్రహ దళం ఒకటి హరిశ్చంద్ర హైస్కూల్ ముందు నుంచి సాగుతుండగా అందులో చదువుకుంటున్న శాస్ర్తీ త్రిభువన నారాయణ సింహ (టి.ఎన్. సింగ్), అలాగే రాయి స్నేహితులతో సహా అందరూ చూస్తుండగానే ఆ ఊరేగింపులో కలిసిపోయాడు. జాతికి అంకితమైనాడు ఆనాటి నుంచి జన్మభూమే ఆయనకు దేవాలయం. ఆయన జీవితమే ఒక ప్రార్థన.గాంధీజీ లోని సత్యాహింసలశాంతివాదం, నేతాజీలోని శౌర్యధైర్య సాహసములు, త్యాగనిరతి లాల్‌బహదూర్‌ని వరించాయి. ప్రధానిగా ‘జై జవాన్ - జై కిసాన్’ అన్న శాస్ర్తిజీ నినాదం దేశం యావత్తు ప్రతిధ్వనించిది. భారత ప్రజానీకం ఉత్తేజితులైనారు. అందుకై బంగారు పథకాలు ప్రవేశపెట్టారు. గాంధీజీ శాస్ర్తిజీ అక్టోబర్ 2న పుట్టారు. జాతీయ పంచాంగమును బట్టి ‘పుష్య బహుళ పంచమినాడు’ ఇద్దరు స్వరస్థులైనారు. తాష్కెంటులో శాస్ర్తిజీ మరణానికి కారణం గుండెపోటు అని నిర్ణయించినా వారి సతీమణి మాత్రం విషప్రయోగం జరిగిందని ఆరోపణ చేసారు. శాస్ర్తిజీ కాంగ్రెస్ సంచాలకుడుగా, శాసనసభ్యుడుగా, మంత్రిగా, ప్రధానిగా ఆకాశానికి త్రివిక్రముడుగా చేరుకున్నా ఒక ఇల్లు గాని భూమి గాని ఆయనకు లేదు....
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: వామన రూపం.. త్రివిక్రమ తేజం! నేడు లాల్‌బహదూర్ జయంతి Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh