728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Thursday, 29 August 2013

భత్కల్ చిక్కాడు !


న్యూఢిల్లీ, ఆగస్టు 29: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్లతో పాటుగా దేశంలోని పలు నగరాల్లో 40కి పైగా పేలుళ్లలో నిందితుడు, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేసారు. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో గత అయిదేళ్లుగా పరారీలో ఉంటున్న 30 ఏళ్ల భత్కల్‌ను ఇంటెలిజన్స్ ఏజన్సీలు, బీహార్ పోలీసులు కలిసి ర్వసించిన ఆపరేషన్‌లో పట్టుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన మరో ముఖ్య నాయకుడు అసదుల్లా అఖ్తర్ అలియాస్ ‘హడ్డీ’తో పాటుగా భత్కల్‌ను అరెస్టు చేసారు. భత్కల్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి భద్రతా ఏజన్సీలు ఇదివరకే 35 లక్షల రూపాయల రివార్డును ప్రకటించాయి. ఢిల్లీ ప్రభుత్వం, జాతీయ దర్యాప్తు ఏజన్సీ (ఎన్‌ఐఏ)లు చెరి పదిలక్షలు, ముంబయి పోలీసులు మరో 15 లక్షల రూపాయల రివార్డులను ప్రకటించాయి. భత్కల్‌ను శుక్రవారం ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి ఎన్‌ఐఏకు అప్పగిస్తామని బీహార్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భత్కల్‌ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో నిన్న రాత్రి కేంద్ర ఇంటెలిజన్స్ ఏజన్సీలు గుర్తించాయని, అతను ప్రస్తుతం బీహార్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని, అతడ్ని ప్రశ్నించడం కొనసాగుతోందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పార్లమెంటు వెలుపల విలేఖరులకు చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమై భత్కల్ అరెస్టు గురించి వివరించారు. ట్రాన్సిట్ రిమాండ్ కోసం భత్కల్‌ను బీహార్‌లోని మోతీహారీకి తీసుకెళ్లి అక్కడి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఢిల్లీలో 30 మందిని పొట్టన పెట్టుకున్న 2008 నాటి వరస బాంబు పేలుళ్ల తర్వాత భత్కల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ అయిదు పేలుళ్లకు ప్రధాన కుట్రదారుడు భత్కలేనని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. 2004లో కర్నాటకనుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పేలుడు పదార్థాలను పంపించడంలో అతని పాత్రపైన కూడా అనుమానాలు ఉన్నాయి. 2006లో 186 మంది మృతికి కారణమైన రైలు పేలుళ్లలో సైతం భత్కల్ ప్రధాన పాత్ర పోషించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పుణెలో జర్మన్ బేకరీ పేలుడు కేసులోను అతనే ప్రధాన నిందితుడు. ఇవే కాకుండా అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లలో జరిగిన పేలుళ్లలో కూడా అతను ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఈ నెల 16న లష్కరే తోయిబాకు చెందిన బాంబు తయారీ నిపణుడు అబ్దుల్ కరీం తుండాను అరెస్టు చేసిన తర్వాత మన భద్రతా ఏజన్సీలు సాధించిన రెండో ఘన విజయం ఇది. ఉత్తర కర్నాటకలోని ఉడిపి జిల్లా భత్కల్ గ్రామానికి చెందిన యాసీన్ తన సోదరుడు రియాజ్, మరి కొందరు అనుచరులతో కలిసి ఇండియన్ ముజాహిదీన్ సంస్థను స్థాపించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నుంచి అందుతున్న అన్ని రకాల సహాయ సహకారాలతో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడిన ఈ సంస్థను 2010 జూన్‌లో ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధించింది. 2011లో అమెరికా కూడా ఇండియన్ ముజాహిదీన్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

ఆంధ్రభూమి దిన పత్రిక సౌజన్యంతో 
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: భత్కల్ చిక్కాడు ! Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh