728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Saturday, 10 November 2012

పాతబస్తీ భాగ్యలక్ష్మి దేవాలయ పరిరక్షణ కై బిజెపి ర్యాలీ ఉద్రిక్తం - అరెస్టులు

హైదరాబాద్, నవంబర్ 10: పాతబస్తీలో భాగ్యలక్ష్మి దేవాలయాన్ని పరిరక్షించాలని, కోర్టు ఆదేశాలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి శనివారం నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది నాయకులు, కార్యకర్తలతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్కు పార్కు వరకూ ర్యాలీ నిర్వహించిన అనంతరం అక్కడి నుండి అసెంబ్లీవైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు బిజెపి నేతలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఒక పక్క భారీగా పోలీసులు మరో పక్క బిజెపి కార్యకర్తలు మధ్య తోపులాటతో ఘర్షణ ఏర్పడింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ కార్యదర్శి లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ తదితరులను అరెస్టు చేశారు. అంతకుముందు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎంకు ముఖ్యమంత్రి తొత్తులా మారారని వారు చెప్పిందే చేస్తున్నారని, వారి ఆగడాలకు అంతులేకుండా పోతోందని అన్నారు. హిందూ దేవాలయాలకు ముప్పు ఏర్పడుతుంటే ఏ రాజకీయ పార్టీ మాట్లాడకుండా వౌనంగా ఉండటం చాలా దారుణమని అన్నారు. కొద్ది రోజులుగా మజ్లిస్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని , పోలీసులను సైతం మజ్లిస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల దేవాలయాల్లో దొంగతనాలకు కూడా కారణాలు కనిపిస్తున్నాయని, ఏళ్ల తరబడి ఉన్న దేవాలయంలో ముస్తాబు చేస్తుంటే దానిని అడ్డుకోవడమే గాక, హిందూ సంస్థలపై మజ్లిస్ నేతలు దాడులకు దిగుతున్నారని విమర్శించారు. ఎంఐఎం నేతలు గూండాయిజం చేస్తున్నారని, దీపావళి సందర్భంగా ప్రతి ఏటా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం ముస్తాబు చేయడం ఆనవాయితీగా ఉందని, అందుకు సిద్ధపడుతున్న సమయంలో అర్ధరాత్రి పూట వేలాది మందితో దేవాలయం వద్దకు చేరుకుని ఎంఐఎం నేతలు భయానక వాతావరణాన్ని సృష్టించారని అన్నారు. దేవాలయ పనులను అడ్డుకోవడమే గాక, న్యాయస్థానాన్ని ఆశ్రయించి పనులు జరగకుండా చూడాలనుకున్నారని, అయితే న్యాయస్థానం పూర్వ స్థితి కొనసాగించుకునేందుకు దేవాలయానికి అనుమతి ఇచ్చిందని, ఆ ఉత్తర్వులను అమలుచేయమని కోరితే కూడా పోలీసులు ముందుకు రావడం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ఇంత జరుగుతుంటే దీనిని ప్రశ్నించిన పూజారులనే పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరమని అన్నారు. ఎంఐఎం ఆగడాలతో పాతబస్తీలోని ప్రజలు భయాందోళనలో ఉన్నారని, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ, తమ దుందుడుకు తనాన్ని ప్రదర్శిస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఎంఐఎం నేతలు అర్ధరాత్రి ఊరేగింపులు, సమావేశాలు నిర్వహిస్తున్నా పోలీసులకు పట్టడం లేదని ఆయన విమర్శించారు.

ఆంధ్రభూమి సౌజన్యంతో 


  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: పాతబస్తీ భాగ్యలక్ష్మి దేవాలయ పరిరక్షణ కై బిజెపి ర్యాలీ ఉద్రిక్తం - అరెస్టులు Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh