728x90 AdSpace

Latest News
Powered by Blogger.
Friday, 23 March 2012

హిందూ సమాజానికి వైభవాన్ని అందించిన ఉగాది

భారతదేశంలో ఉగాది రోజున నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది ముహూర్తం అన్ని శుభ కార్యాలను ప్రారంభం చేయడానికి సరైనదిగా భావించబడుతుంది. దానికి సూచనగా ప్రకృతి కూడా పచ్చగా కనబడుతుంది. చెట్లన్నీ రాలిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుర్లు వేసి ఉత్సాహంగా కనబడతాయి. కోయిలలు కుహూ... కుహూ... అని కూస్తూ కూనిరాగాలు తీస్తూంటాయి. పిల్లలు ఈ కూని రాగాలకు వంత పాడుతూ కాసేపు తామూ గాన కోయిలలై పరవశించి పోతారు. అప్పటి వరకు ఊరిస్తున్న మామిడి కాయల పిందెలు పండడానికి తయారైపోతాయి. ఈ విధంగా హిందూ జీవన విధానంలో ఉగాది పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. 

ఈ పండుగకు జాతీయ స్ఫూర్తితో కూడా సంబంధం ఉన్నది

భగవాన్ శ్రీరాముడు : భారతీయుల దృష్టిలో శ్రీరాముడు ఆదర్శ రాజు, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పతి, ఆదర్శ పురుషుడు. భారతీయతే ఆయనగా అవతరించిందంటే అది సనాతన సత్యం. అందుకే భారతీయులకు, మానవ ధర్మమైన సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి వ్యక్తికీ "అంతా రామమయం - జగమంతా రామమయం" అయి నిలిచింది. అటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం ఉగాది రోజే జరిగింది. శ్రీరాముడి నవరాత్రులు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. 

ధర్మరాజు పట్టాభిషేకం : ధర్మరాజు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదే. కౌరవులు అధర్మపరులై, ధర్మమూర్తులైన పాండవులను కించపరిచినప్పుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవుల నోడించిన ధర్మరాజు తన పట్టాభిషేకానికి ఉగాదినే ఎంచుకున్నాడు. ధర్మానికి విజయం లభించిన రోజది. 

శకులను తరిమిన శాలివాహనుడు : 1890 సంవత్సరాలకు పూర్వంనాటి మాట. భారత సమాజం భోగాభాగ్యాలలో మైమరచి, నిత్య జాగృతమైన ప్రజా జీవితంలోనే శక్తి ఉంటుందనే మాట మరచి ఉన్నప్పుడు భారతదేశంపై విదేశీయులైన శకులు దండెత్తి భారతభూమి నాక్రమించి మధ్య భారతం దాకా వచ్చారు. వారికి ధర్మం, సంస్కృతీ, సభ్యతలు లేవు. భారతదేశం మీద పడి ఎన్నో అక్రమాలు, అత్యాచారాలు జరిపారు. దాంతో ప్రజలు నీరసులైనారు. వారిలో జడత్వం వ్యాపించింది. అప్పుడు ఆవిర్భవించినవాడు శాలివాహనుడు. మట్టిలా ప్రాణహీనులై, జడులై, చైతన్యం లేని సాధారణ ప్రజలను సంఘటిత పరచి వారిలో ధర్మనిష్ఠను, సమాజ భావాన్ని, పౌరుష శక్తులను నింపి, అలా సమీకరించిన సంఘటిత శక్తితో శకులను పూర్తిగా ఓడించాడు. నాటి విజయగాథ చిహ్నంగా ఉగాది నుండి శాలివాహన శకం ప్రారంభమై నేటికీ తెలుగు, కన్నడ, మరాఠీ, మాళవ ప్రాంతాలలో స్మరింపబడుతున్నది.


డా.హెడ్గేవార్ : అటువంటి పుణ్యప్రదమైన, మహత్తరమైన ఉగాది రోజునే డాక్టర్ హెడ్గేవార్ కూడా జన్మించారు.  వారు ఉగాదినాడు జన్మించడం కూడా ఒక సార్ధకమైన సంఘటనే. 

భారతదేశంలో ఆంగ్లేయుల రాజ్యం అనేక రకాలుగా, పటిష్టంగా వ్రేళ్ళు పాతుకొని ఉన్న సమయం. సమాజం ఆత్మవిస్మృతితో, అజ్ఞానంతో, నిరంతర శోషణతో, అసంఘటితమై, అశక్తమై, బానిసత్వపు సంకెలలో తగులుకొని తపిస్తున్నది. మనకాంగ్లేయులే గతి అని కొందరు, హిందుత్వం నీరసత్వమని కొందరు, ముస్లింల సహాయం లేనిదే స్వరాజ్య సాధనకు దారి దొరకదని కొందరు వాపోతుండే కాలంలో జన్మించారు డాక్టర్జీ. వారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించి "ఇది హిందువుల దేశం, మనదేశం. ఇది చారిత్రిక సత్యం. హిందువులలో సంఘటన, దేశభక్తి ఉంటే వారినెవ్వరూ ఓడించజాలరు, దేశానికి పరాభవం జరుగదు" అని చాటి తిరిగి హిందువులలో చైతన్యాన్ని నింపారు.  ఇంతమంది చైతన్య మూర్తులను హిందూ సమాజానికి అందించిన మహత్తరమైన రోజు ఉగాది. 

ఉగాది పచ్చడి వేసవి తాపానికి ఔషధం : 



ఉగాదినాడు వేపపూలతో, కొత్త చింతపండుతో, బెల్లంతో తయారుచేసిన పచ్చడిని తినడం వలన చైత్రం నుండి విపరీతమైన ఎండల తాకిడిని తట్టుకొనే శక్తి శరీరానికి లభిస్తుంది. వాతావరణ మార్పు వలన వచ్చిన జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటివి నశిస్తాయి. అందుకే మన ఋషులు ఈ పచ్చడిని పండుగలో భాగంగా పెట్టారు. తాత్వికంగా ఆలోచిస్తే మానవుడు మంచి-చెడులు రెంటినీ స్వీకరించాలని ఈ పండుగ తెలియచేస్తున్నది.

సంవత్సరాది నుండి ప్రతి వ్యక్తీ కొత్త ఆలోచనలతో, ఆశయాలతో అభివృద్ధి పథంలో పయనించాలని అనుకొంటాడు. గతంలో తాను పొందలేకపోయిన విజయాలను ఈ సంవత్సరంలో పొందాలని నిర్ణయించుకొంటాడు.

ఈ విధంగా చారిత్రికంగా, సాంస్కృతికంగా, ఆరోగ్యపరంగా ఉగాది హిందూ జీవనంలో ఒక భాగమైన, ఆనందకరమైన పండుగ. ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుందాం. 
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: హిందూ సమాజానికి వైభవాన్ని అందించిన ఉగాది Rating: 5 Reviewed By: Yogeshwar Khandesh